అయోధ్య (Ayodhya)లో బలవంత మత మార్పిడికి ప్రయత్నించిన ఓ చర్చి ఫాదర్ పై కేసు నమోదైంది. తనను క్రైస్తవ మతంలోకి మారాలంటూ ఆశిశ్ కుమార్ పీటర్ (Ashish Kumar Peter) అనే మత ప్రబోధకుడు తనపై ఒత్తిడి తెచ్చినట్టు ఇండియన్ ఆర్మీ జవాన్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవాన్ ప్రస్తుతం ఇండియా- పాకిస్తాన్ సరిహద్దులోని బింద్ పంజాబ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
డబ్బు ఆశ చూపి తనను మతం మార్చేందుకు ఆశిశ్ ప్రయత్నించాడని సుబేదార్ శ్యామ్ గిరి ఆరోపించారు. ఈ మేరకు అయోధ్య కోటవాలి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా వుంటే నిందితుడు అయోధ్యకు సమీపంలోని మోదాహలో నివాసం ఉంటున్నాడు. ఎఫ్ జీ మిషన్ చర్చితో సంబంధాలు వున్నట్టు శ్యామ్ గిరి వెల్లడించారు.
బాధితుని వివరాల ప్రకారం…. శ్యామ్ గిరి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పదవీ విరమణ తర్వాత అయోధ్యలో ఇల్లు కట్టుకుని శేష జీవితాన్ని అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆశీశ్ పీటర్ ను ప్రాపర్టీ డీలర్ గా చెబుతూ శ్యామ్ తండ్రికి అతని స్నేహితుడు పరిచయం చేశాడు. ఆ తర్వాత శంకర్ పీటర్, సచిన్ చౌదరి అనే మరో ఇద్దరు వ్యక్తులు ప్రాపర్టీ డీలర్స్ మంటూ శ్యామ్ తండ్రితో పరిచయం పెంచుకున్నారు.
ఈ క్రమంలో భూమి ఇప్పిస్తామంటూ శ్యామ్ తండ్రి నుంచి ఆ ఇద్దరు రూ. 20 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత వాళ్లకు శ్యామ్ తండ్రి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. దీంతో జరిగిన విషయాన్ని శ్యామ్ కు ఆయన తండ్రి తెలియజేశాడు. ఈ క్రమంలో సెలవు పెట్టి శ్యామ్ తన తండ్రి వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆశీశ్ పీటర్ అడ్రస్ తెలుసుకుని అతని వద్దకు వెళ్లాడు.
ఆ సమయంలో ఆశీశ్ పీటర్, శ్యామ్ శంకర్ పీటర్ అక్కడే వున్నారు. శ్యామ్ పై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారు. పైసలు తిరిగి ఇవ్వాలంటే మతం మారాలని లేదంటే పైసలు తిరిగి ఇవ్వబోమని వాళ్లు హెచ్చరించారని బాధితుడు ఆరోపించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.