ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు కీలకంగా మారుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఓటమి లక్ష్యంగా టీడీపీ (TDP)..జనసేన వ్యూహరచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.
యువతే జనసేనకు పెద్ద బలమని.. యువతలో జనసేన (Janasena)కు ఉన్న ఫాలోయింగ్ చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల క్యాడర్ ఉందని తెలిపారు. అవినీతి పై చేసే పోరాటంలో గెలుపు ఓటములు అనేవి వాన చినుకు లాంటివని తెలిపిన పవన్.. టీడీపీతో పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీ (YCP) ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణతో పాటు.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా ఇటీవల బీజేపీతో కలిసి తెలంగాణా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ.. ఏపీలో కూడా రాజకీయ స్థానం సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తో కలిసి ప్రయాణం చెయ్యాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది..
అదీగాక గత ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఈ ఎన్నికల్లో తగలకుండా పవన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఈసారి ఎన్నికల్లో జగన్ (Jagan)ని గద్దె దించటం టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల ఆవేశాన్ని ఓటు బ్యాంక్ లా మార్చుకునే దిశగా టీడీపీతో కలిసి జనసేన పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.. మొత్తానికి ఎన్నికల సమయానికి జనసేన అంటే ఏంటో వైసీపీకి అర్థం అయ్యేలా చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని జనసేన వర్గాలలో టాక్ వినిపిస్తుంది.