విశాఖలో నేతల అరెస్టులపై జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జనసేన నేతలను వెంటనే విడుదల చేయకపోతే తానే విశాఖ వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతానని జనసేనాని స్పష్టం చేశారు. విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతపై జనసేన నేతలు నిరసనకు పిలుపివ్వడంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నోవాటెల్ హోటల్ దగ్గర నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టైకూన్ జంక్షన్ వీఐపీ రోడ్డు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
సిరిపురంలో పీక్స్ అనే ప్రాజెక్టును ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు డివైడర్‌ను మూసివేశారు. వాహనరాకపోకలు నిలిపివేశారు. దీన్ని జనసేన నేతలు ఖండించారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైసీపీకి ఓటమి తప్పదన్నారు. మూడు నెలలుగా టైకూన్ జంక్షన్లో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఎంపీ తనకు అనుకూలంగా జంక్షన్ మధ్యలో బార్కెట్లు వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ఇది వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం కాదా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఎంపీ సత్యనారాయణ లేఖ రాసినా పోలీసులు బారికేట్లను ఎందుకు తొలగించడం లేదన్నారు. అయితే, ఈ విషయమై పలు మార్లు కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామని అయినా పట్టనట్లు వున్నారని నాదేండ్ల ఆరోపించారు. పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుదామని పిలిపిస్తే తమను హోటల్ నుంచి బయటకు వెళ్ళనివ్వకపోవడం ఏంటని నిలదీశారు.