ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులతో, వైసీపీతో సమరానికి సిద్దం అవుతున్నారు.. జగన్ ఓటమి లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేనాని పవన్ కల్యాణ్ పై గుంటూరు (Guntur) కోర్టులో క్రిమినల్ కేసు (Criminal Case) నమోదైంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై, వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం క్రిమినల్ కేసు (Criminal Case) దాఖలు చేసింది. ప్రభుత్వం తన మానసపుత్రులుగా చెప్పుకొంటున్న వలంటీర్లపై పవన్ గత ఏడాది జరిగిన సభలో అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపించింది. వలంటీర్లను కించపరిచేలా, వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు దాఖలు చేసింది.
ఈ అంశాన్ని జిల్లా ప్రధాన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు మార్చి 25న పవన్ కల్యాణ్ విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు. మరోవైపు ఏలూరులో పవన్ కల్యాణ్ గత ఏడాది జులై 9న వారాహి యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తనకు సమాచారం అందినట్లు తెలిపారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళల్లో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు వెల్లడించారు. మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళల అదృశ్యం గురించి డీజీపీ సైతం సమీక్షించలేదని విమర్శించారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళ అదృశ్యం వెనుక వలంటీర్ల పాత్ర ఉందని ఆరోపించిన పవన్ కల్యాణ్.. వలంటీర్లు ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి, సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని, వారి ద్వారా వల వేసి అపహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వాటిలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేసింది.