ఏపీ(AP)లో పొలిటికల్ పొత్తులు(Political alliances) కాకపుట్టిస్తున్నాయి. బీజేపీ(BJP), టీడీపీ(TDP), జనసేన(Janasena) పొత్తు ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena chief Pawan Kalyan) ఎక్స్(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఏపీ విభజనలో అర్ధ దశాబ్ద కాలంగా వైసీపీ ప్రభుత్వ విధానపరమైన తీవ్రవాదం, అవినీతి, ఇసుక, విలువైన ఖనిజాల వంటి సహజ వనరుల దోపిడీ, మద్యం మాఫియాతో రాష్ట్రం అల్లకల్లోలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలైన అకృత్యాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పారిపోయారని వెల్లడించారు.
ఆలయాలను అపవిత్రం చేశారని, టీటీడీని ఎటీఎంగా మార్చారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్, 30వేల మందికి పైగా మహిళల అదృశ్యం, దళితులపై అత్యధిక దౌర్జన్యాలు తదితర అకృత్యాలతో రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక రాజకీయ గందరగోళం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకులు వారి పార్టీ కేడర్‌పై బలవంతం, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. దీనికి ముగింపు పలకడానికి రానున్న ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముగింపు పలకనుందని పేర్కొన్నారు. చివరగా బీజేపీలో తమకు భాగస్వామ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.