తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP)తో కలిసి బరిలోకి దిగిన జనసేన రాష్ట్రంలో పాగా వేద్దామని, పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించి గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే సభలకి జనం కుప్పలు తెప్పలుగా వచ్చారు కానీ.. రిజల్ట్ చూస్తే మాత్రం గాజు గ్లాస్‌కి రాష్ట్రంలో మళ్లీ గట్టిదెబ్బే కొట్టారు. ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటకపోతే.. జనసేనకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు.
మంగళగిరి కేంద్ర కార్యాలయంలో వారం రోజులుగా మకాం వేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో చర్చలు నిర్వహించినట్టు సమాచారం.. టీడీపీ (TDP)తో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ ఉమ్మడి పోరులో భాగంగా పవన్ కళ్యాణ్.. మొత్తం 175 నియోజక వర్గాలకు గాను 25 నుంచి 40 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలిపేందుకు కసరత్తు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటివరకు 16 నియోజకవర్గాల ఇంచార్జులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారని తెలుస్తోంది.. ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతకు రాగా పార్టీ పరిస్థితిపై గత వారం రోజులుగా సమీక్షిస్తున్నారు. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొన్న పవన్.. ఈ సారి ఏపీలో పార్టీ బలోపేతంపై పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది..
మరోవైపు చిత్తూరు జిల్లా తిరుపతి, ప్రకాశం జిల్లా ఒంగోలు, గుంటూరు వెస్ట్, తెనాలి, మచిలీపట్నం అవనిగడ్డ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కొత్తపేట, అమలాపురం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి, ఎలమంచిలి, పెందుర్తి, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో నెలిమర్ల నియోజక వర్గాల పరిధిలో పార్టీ తరపున అభ్యర్థులను నిలిపే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు విశ్వనీయ సమాచారం. కాగా తెలంగాణలో ఆశించిన స్థాయిలో జనసేన లేకపోయినా.. ఏపీలో మాత్రం పార్టీని బలపరచడానికి పవన్ ప్లాన్ గట్టి ప్లాన్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది..