ఏపీ (AP)లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగిల్ గా వైసీపీ (YCP).. పొత్తులతో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP).. రంగంలోకి దిగనున్నాయి.. జగన్ (Jagan) ఓటమి లక్ష్యంగా వ్యూహరచనలో నిమగ్నం అయ్యాయి.. అధికారంలోకి రావాలని కూటమి.. ఉన్న అధికారాన్ని కోల్పోకుండా ఉండాలని వైసీపీ ఉబలాటపడుతున్నాయి..
అయితే కూటమిగా ఏర్పడిన తర్వాత.. టీడీపీ, జనసేన కు కొందరు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలైయ్యాయి.. అయినా విజయం అందుకోవాలని భావిస్తున్న కూటమి నేతలు వారిని బుజ్జగిస్తూ ముందుకు వెళ్ళడం కనిపిస్తోంది. ఇక జనసేన కు ఈ ఎన్నికల్లో విక్టరీ రుచి చూపించాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
ఈ విరాళం చెక్కులను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో, కోశాధికారి ఎ.వి.రత్నంకు అందించారు.. అదేవిధంగా తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు సైతం పవన్ విరాళం ఇవ్వడం తెలిసిందే.. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేనాని.. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుందని తెలిపారు.
అందుకే ఈ రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని పేర్కొన్నారు.. నేను కాకుండా ఒక బెల్దారీ మేస్త్రీ రూ. లక్ష విరాళం అందించారని.. అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారన్నారని గుర్తు చేసుకొన్నారు.. ఇంత మంది ఆశయాలతో ఊపిరి పోసుకొంటున్న జనసేన కష్ట జీవుల ఆశల కోసం ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు..