ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) బీఫామ్‌లు అందజేశారు. మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పొత్తులో భాగంగా జనసేన నుంచి 21 అసెంబ్లీ, ఇద్దరు లోక్ సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు తొలుత నాదెండ్ల మనోహర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. వివాదాలకు తావు లేకుండా అందరి సమన్వయంతో ఏపీని పునర్నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలే తన దేవుళ్లని, వారికి నిత్యం అందుబాటులో ఉంటామని జనసేనాని స్పష్టం చేశారు.
పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణ బద్దులై పని చేస్తామన్నారు. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు అందరి బాధ్యత అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. రాజ్యాంగం సాక్షిగా వీటికి కట్టుబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు.
ఈ ఎన్నిక చాలా కీలకమైనదని, ఓట్లు చీలకుండా ఉండేందుకే పొత్తులకు వెళ్లామని పునరుద్ఘాటించారు. ఈ అవినీతి, రాక్షస పాలనను తరిమి కొట్టాలన్నారు. నిబద్ధతతో పనిచేయాలనే అందరితో ప్రతిజ్ఞను చేయించామని, శ్రీరామ నవమి రోజు అందరం బి ఫారాలు తీసుకున్నామని, త్వరలో రామరాజ్యం స్థాపిద్దామని అన్నారు.