ఏపీ (AP)లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ (TDP).. జనసేన (Janasena) పొత్తులపై ప్రాధాన్యత సంతరించుకోంది. ఇప్పటికే వీరి పొత్తులపై కొన్ని పుకార్లు వ్యాపించగా, ప్రస్తుతం అంతా క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక (Pawan Kalyan) వ్యాఖ్యలు చేశారు.. జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన పవన్.. పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దని కోరారు. అభిప్రాయాలూ, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇలా చేయడా ద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయని పేర్కొన్నారు. మరోవైపు పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి పూర్తి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవశ్యం అని జనసేన శ్రేణులను పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకువస్తున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపువచ్చిన నేపథ్యంలో పొలిటికల్ స్టోరీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన.. టీడీపీ.. వైసీపీని టార్గెట్ చేయగా.. బీజేపీ ఎంట్రీ ఎవరి విజయానికి పునాదులు వేస్తుందో అనే చర్చలు జోరుగా మొదలైనట్లు తెలుస్తోంది..