తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు వారాలు సమయం ఉన్నా నేతల వలసలు మాత్రం ఆగడంలేదు. రాష్ట్రంలో ఉన్న ముడుప్రాధాన పార్టీల నుంచి అసంతృప్తుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar) రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా గత ఐదేళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. కానీ ఏనాడూ కాంగ్రెస్ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదని అనిల్ ఆరోపించారు. నేషనల్ పేపర్లకు యాడ్స్ ఇవ్వడంతో నాకు ED నోటీసులు అందాయి. ఇంత జరిగినా పార్టీ రాష్ట్ర నాయకత్వం కనీసం పలకరించలేదని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సరైన గౌరవం, ప్రాధాన్యత దొరకడం లేదని అనిల్ విమర్శించారు.
మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao)..అనిల్ కుమార్ ను కలిసి చర్చలు జరిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యే (Patan Cheru MLA) గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్ పూర్‌లో ఉన్న అనిల్ కుమార్ ఇంటికి వెళ్లిన హరీష్ రావు.. ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అనిల్ పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
ఈ మేరకు తన కార్యకర్తలతో కలిసి నర్సాపూర్ లో జరగనున్న సభలో.. సీఎం కేసీఆర్ సమక్షంలో.. అనిల్ కుమార్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్, గాలి అనిల్ కుమార్ ఆశించారు. కానీ ఆవుల రాజిరెడ్డికి కాంగ్రెస్ (Congress) అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది. ఫలితంగా గాలి అనిల్ కుమార్ రాజీనామా వరకు వెళ్ళింది.