ప్రశ్నాపత్రాల లీకేజ్ తో అయిన జరిగిన డ్యామేజ్ ను టీఎస్పీఎస్సీ (TSPSC) పూడ్చుకునే పనిలో పడింది. వరుసగా ఆగిపోయిన పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించగా.. ఈనెల 29, 30న గ్రూప్-2 (Group-2) పరీక్షను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఈ పరీక్షను వాయిదా వేయాలని.. షెడ్యూల్ లో మార్పులు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టు (High Court) ను సైతం ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలైంది. ఈనెల 29, 30న తలపెట్టిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అందులో కోరారు. 150 మంది అభ్యర్థులు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున.. గ్రూప్-2 ను రీ-షెడ్యూల్ చేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
మరోవైపు.. టీఎస్పీఎస్సీ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్- 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్ కి సమయం లేదని వాయిదా వేయాలన్నారు. ఈనెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుతున్నాయి. దీంతో గ్రూప్స్ కి సమయం లేదని వాపోతున్నారు.
వచ్చే నెలలో టెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 వాయిదా వేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. వేలాది మంది అభ్యర్థులు అక్కడ బైఠాయించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.