శ్రీశైలయం ఆలయ అభివృద్ధి (srisailam Temple) కోసం ఏర్పాటైన గత పాలక మండలిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేవస్థానం అభివృద్ధి కోసం జీవో ఆర్ టీ నెంబర్ 202ను 24/03/2022న 15 మందితో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేసింది. గత నెల మార్చితో పాలక మండలి గడువు ముగిసిపోయింది.ఈ రెండేళ్ల కాలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంటే అంతా శూన్యమే అని చెప్పవచ్చు.
కానీ, పాలక మండలిలోని ధర్మకర్తలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి సంబంధించి కాటేజీలను నచ్చినవారికి కేటాయించడం, ట్రస్టు పరిధిలోని భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చడం, బోర్డు సభ్యుల నియామకం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపణలున్నాయి. రాజకీయ నేతలు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు బోర్డులో సభ్యులుగా ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆలయ గత ట్రస్ట్ బోర్డుపై ఏపీ హైకోర్టులో రిట్(నంబర్ 7812/2024) పిటిషన్ దాఖలైంది.హిందూ జనశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ పిటిషన్ వేశారు.
దీంతో దేవాదాయ శాఖ అధికారులకు, ట్రస్టు బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సంబంధిత పత్రాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు సూచిస్తూ ఏప్రిల్ 16 కు విచారణ వాయిదా వేసింది.
రిట్ పిటీషన్‌లోని కీలక అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే.. అందులో చైర్మన్ రెండేళ్ల పాటు కాటేజీని వాడుకున్నందుకు అద్దె చెల్లించాలి. ఎమ్మెల్యే హాజరైన 3 సమావేశాలను రద్దు చేయాలి.రాజకీయ ప్రభావం కారణంగా ఎజెండాలను పరిగణనలోకి తీసుకోకూడదు. భక్తుల సొమ్మును ఆక్రమణదారుల కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం మరియు డబ్బును వృథా చేయడం ఆపాలి.ట్రస్ట్ బోర్డు భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా ఆమోదించింది.దాని మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. రెండేళ్ల కాలంలో ట్రస్ట్ బోర్డు వ్యవధిలో కేటాయించిన భూములన్నింటినీ రద్దు చేయాలని రిట్ పిటీషన్‌లో పేర్కొన్నారు.