పెట్రోల్ ధరలు(Petrol Prices) అధికంగా ఉండడంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై పడుతోంది. దీంతో సామాన్యులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్(Central Government) ప్రజలకు ఊరట కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలుపొందిన బీజేపీ(BJP) వచ్చే సార్వత్రిక ఎన్నికలపై నజర్ పెట్టింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను త్వరలో తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం.
పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.6 నుంచి రూ.10 వరకు తగ్గించాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. నెలాఖరులోపే ఈ ధరలు అమలులోకి రావచ్చని పేర్కొంటున్నాయి. ఇంకా ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోడీ ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం.
చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సెజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8, లీటర్ డీజిల్ ధర రూ.6 మేర తగ్గింది. కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచకపోవడంతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై మోపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సదరు సంస్థలు తగ్గించలేదు. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.5,8198కోట్ల ఆదాయాన్ని పొందాయి.