సీఎం వీడియో కాన్ఫరెన్స్ (CM Video Conferance)కు పిఠాపురం ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. మంగళగరిలోని సెక్రటేరియట్‌లో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pendeam Dora Babu) హాజరు కాలేదు. ఇటీవల పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది.
జనవరిలో పలు పథకాలను అమలు చేసేందుకు వైసీపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ ఈ భేటీకి పెండెం దొరబాబు దూరంగా ఉన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఆశిస్తున్న దొరబాబుకు సీఎం జగన్ ఇటీవల షాక్ ఇచ్చారు. పిఠాపురం సీటును దొరబాబుకు కేటాయించేందుకు సీఎం జగన్ నిరాకరించారు. ఆ సీటును వేరే అభ్యర్థికి కేటాయించాలనే యోచనలో సీఎం ఉన్నారు. దీంతో గత కొంత కాలంగా పార్టీకి దొరబాబు దూరంగా ఉంటున్నారు.
మరోవైపు నియోజకవర్గంలో తన సొంత వర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయన పార్టీని వీడతారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఆయన సీఎం కాన్ఫరెన్స్ కు దూరంగా ఉండటంతో ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి.