అత్యాధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్దరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ (Ayodhya Dham Railway Station) ను ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. రైల్వే స్టేషన్లో ఆరు వందేభారత్ రైళ్లను, రెండు అమృత్ రైళ్లను జెండా ఊపి ప్రధాని మోడీ ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ను జాతికి అంకితం ఇస్తున్నట్టు వెల్లడించారు. రూ. 240 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ ను ఇటీవల పునరుద్ధరించారు.
అయోధ్య రైల్వే స్టేషన్ పేరును తాజాగా అయోధ్య ధామ్ గా మార్చారు. రైల్వే స్టేషన్ ముందు భాగాన్ని రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉండేలా రూపొందించారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో మాదిరిగా అయోధ్య ధామ్ లో కూడా అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ స్టేషన్ లో మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ ముఖ ద్వారంపై మకుటం, గోడలపై విల్లు నిర్మాణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
స్టేషన్ నిర్మాణానికి కాంక్రీటుతో పాటు సున్నపురాయితో నిర్మించిన పిల్లర్లను ఉపయోగించారు. ఈ పిల్లర్లు అయోధ్య ధామ్ కు ఒక నూతన శోభను అందిస్తున్నాయి. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో దీన్ని పునరుద్ధరించారు. ఇందులో ఫుడ్ ప్లాజాలు, వెయిటింగ్ హాల్స్, క్లాక్ రూమ్స్, చైల్డ్ కేర్ రూమ్స్, పూజా దుకాణాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఇలా ఎన్నో ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.
ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం అయోధ్యకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. మొత్తం 15 కిలోమీటర్ల దూరం ఆయన రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్ షో మధ్యలో పలు ప్రాంతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.