ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పంచె కట్టులో అదరగొట్టారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ (L. Murugan) నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుక (Pongal Celebrations)ల్లో ఆయన సాంప్రదాయ పంచెకట్టులో కనిపించారు. అక్కడ కట్టెల పొయ్యిపై పాయసం వండారు.
అనంతరం అక్కడ గోమాతకు సారె సమర్పించి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పౌరులందరి జీవితాల్లో ఆనందం వెల్లువల రావాలని కోరుకున్నారు. పొంగల్ పండుగ ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ భావాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఐక్యతా భావాలు 2047 వికసిత్ భారత్కు బలాన్ని ఇస్తాయని మోడీ అన్నారు. దేశంలో మూడు కోట్ల మంది రైతులు శ్రీ అన్న (మిల్లెట్ గ్రెయిన్స్) ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా శ్రీ అన్నను ప్రోత్సహిస్తే మూడు కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
ఉత్తరాయణం సందర్భంగా దేశప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అందరి సంతోషం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలను కూడా తీసుకురావాలని మోడీ ఆకాంక్షించారు. భగవంతుడు అందరి ఆకాంక్షలను నెరవేర్చాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.