– ప్రధాని మోడీ టూరిజం ప్రమోషన్
– లక్షద్వీప్ అందాలను వివరిస్తూ ట్వీట్
– సముద్రం అడుగున డైవింగ్
– ఎంతో అద్భుతమైన అనుభవమన్న పీఎం
– ఎవరూ మిస్ కావొద్దని పిలుపు
లక్షద్వీప్ (Lakshadweep)లో ప్రధాని మోడీ (PM Modi) ‘స్నార్కెలింగ్’ (Snorkelling)సాహనం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను గురువారం తన ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాలో మోడీ షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ బుధవారం లక్షద్వీప్ వెళ్లారు. అక్కడ ప్రకృతిని ఆయన ఆస్వాదించారు.
తాజాగా తన లక్షద్వీప్ పర్యటన గురించి కొన్ని విషయాలను ప్రధాని మోడీ ట్విట్టర్ లో ప్రజలతో పంచుకున్నారు. లక్షద్వీప్‌లో తాను స్నార్కెలింగ్ ( సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్) చేశానని పేర్కొన్నారు. ఇది చాలా అద్భుతమైన అనుభవం అని వెల్లడించారు. సాహసాలు చేయాలనుకునే వాళ్లు తమ అడ్వెంచరెస్ ప్లేస్ ల జాబితాలో లక్షద్వీప్ లను చేర్చుకోవాల్సిందేనన్నారు. స్నార్కెలింగ్ సమయంలో నీటి అడుగు భాగంలో తీసిన ఫోటోలను కూడా మోడీ షేర్ చేశారు.
నీటి అడుగు భాగంలో ఉన్న ఇసుక దిబ్బలు, సముద్ర జీవులు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి. అగట్టి, బంగారం, కవరట్టి వాసులతో తాను సంభాషించానని మోడీ చెప్పారు. అక్కడ తనకు గొప్ప ఆతిథ్యం లభించిందన్నారు. వారి ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. లక్షద్వీప్ అనేది కేవలం ద్వీపాల సమూహం మాత్రమే కాదని అన్నారు.
ఇది సంప్రదాయాల శాశ్వతమైన వారసత్వమని, అక్కడి ప్రజల స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్దిని ప్రోత్సహించడం, మెరుగైన వైద్య ఆరోగ్య సౌకరర్యాలు కల్పించడం, వేగవంతమైన ఇంటర్నెట్, తాగునీటి అవకాశాలు కల్పించడం, ఇక్కడి సంస్కృతిని సంరక్షించడం ద్వారా లక్ష ద్వీప్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు.