ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాయని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. దేశంలో వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలించిందన్నారు. రాబోయే ఏడాది కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ సూచించారు. ఈ ఏడాదిలో చివరి ‘మన్ కీ బాత్’(mann ki baat)కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రదాని మోడీ ప్రసంగించారు.
‘ఇది మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్. మన సమాజంలో 108కి ప్రత్యేక ఉంది. మన్ కీ బాత్ 108 ఎపిసోడ్లలో ప్రజల భాగస్వామ్యానికి, వారి నుంచి ప్రేరణ పొందిన అనేక ఉదాహరణలను మనం చూశాం. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించింది. ఎంతో కాలంగా మనమంతా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తంచేశారు’అని అన్నారు.
భారత్ గురించి ప్రతిచోటా వ్యాపించిన ఆశ, ఉత్సాహం గురించి మనం ఇప్పుడే చర్చించాం. ఈ ఆశ, అంచనాలు చాలా బాగున్నాయి. భారత్ అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడి యువత ఎక్కువగా ప్రయోజనం పొందుతుంది. కానీ యువత ఫిట్‌గా ఉన్నప్పుడు మరింత ప్రయోజనం పొందుతారు. భారత్ ప్రయత్నాల వల్ల 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకున్నాం. దీనివల్ల ఆ రంగంలో పని చేస్తున్న చాలా స్టార్టప్ కంపెనీలకు అద్భుతమైన అవకాశాలు లభించాయి’అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ స్వంత అభిప్రాయాలను వ్యక్తపరిచారు, కానీ అందరికీ ఒకే మంత్రం ఉంది – ‘ఆరోగ్యంగా ఉండండి… ఫిట్ గా ఉండండి. 2024ను ప్రారంభించేందుకు మీ సొంత ఫిట్నెస్ కంటే పెద్ద సంకల్పం ఏం ఉంది. ఈ ఏడాది కాశీ తమిళ సంగమంలో పాల్గొనేందుకు తమిళనాడు నుండి వేలాది మంది ప్రజలు కాశీ చేరుకున్నారు. అక్కడ నేను వారితో కమ్యూనికేట్ చేయడానికి మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్ భాషిణిని ఉపయోగించాను’అని వివరించారు.
‘జార్ఖండ్‌లోని ఓ గిరిజన గ్రామం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రామంలో పిల్లలకు వారి మాతృభాషలో విద్యను అందించడానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ భాష (కుదుఖ్) క్రమంగా అంతరించిపోతోంది. దాన్ని కాపాడుకునేందుకు ఈ సంఘం పిల్లలకు వారి స్వంత భాషలో విద్యను అందించాలని నిర్ణయించింది. మన దేశంలో భాషపరమైన ఇబ్బందుల నేపథ్యంలో చాలా మంది పిల్లలు చదువును మధ్యలోనే వదిలివేస్తున్నారు’అని చెప్పారు.
గుజరాత్లో దైరో సంప్రదాయం ఉంది. రాత్రంతా వేలాది మంది డైరోలో చేరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుతున్నారు. అయోధ్యలో రామమందిరానికి సంబంధించి దేశం మొత్తంలో ఉత్కంఠ, ఉత్సాహం ఉంది. ప్రజలు తమ భావాలను అనేక రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. మనమంతా అలాంటి క్రియేషన్స్‌ను ఉమ్మడి హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయగలమా? శ్రీ రామ్ భజన్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ క్రియేషన్లను సోషల్ మీడియాలో షేర్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’అని తెలిపారు.
దేశప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రధాని మోడీ తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇప్పటికీ సందేశాలు వస్తున్నాయన్నారు. ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ రావడతంతో దేశం మొత్తం ఉర్రూతలూగింది. ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు దక్కడంతో మరోసారి భారతీయుల ప్రతిభ వెలుగులోకి వచ్చిందన్నారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ-మేరా దేశ్ వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. దేశంలో 70 వేలకుపైగా అమృత్ సరోవర్లను నిర్మించామన్నారు. ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోతుందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో భారత్ ఇప్పుడు ఒక గొప్ప ఇన్నోవేషన్ హబ్‌గా మారిందని వివరించారు.