ఈ భవనం మన గౌరవాన్ని పెంచింది
ఇక్కడ జరిగిన ప్రతి చర్చ దేశగతిని మార్చింది
ఈ భవనంతో అందరికీ తీపి, చేదు జ్ఞాపకాలు వున్నాయి
దేశంలో సువర్ణాధ్యాయానికి ఇది సాక్షిభూతంగా నిలిచింది
దేశాభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం కనిపిస్తుంది
75 ఏండల్లో మన విజయాలు ప్రపంచాన్ని అబ్బురపరిచాయి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ
ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు పార్లమెంటు భవనం వేదికగా నిలిచిందని ప్రధాని మోడీ(Pm modi) అన్నారు. ఈ భవనంలో జరిగిన ప్రతి చర్చా భారత(India) గతిని మార్చిందని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం(parliament buiding) మనకు కనిపిస్తుందని చెప్పారు. కొత్త భవనంలోకి వెళ్లినప్పటికీ ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షిభూతంగా నిలిచిందన్నారు. ఈ చారిత్రక(పార్లమెంట్ పాత) భవనం నుంచి ఇప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నామన్నారు. ఈ భవనం వీడుతున్న సందర్భంలో అనేక అనుభవాలు గుర్తుకు వస్తున్నాయన్నారు.
జీ-20 గురించి ప్రస్తావించిన ప్రధాని….!
జీ-20 విజయం భారతీయులందరిదని ప్రధాని మోడీ అన్నారు. ఈ విజయం ఏ ఒక్క పార్టీదో లేదా ఒక వర్గానిదో కాదని స్పష్టం చేశారు. జీ-20 సమావేశాల నిర్వహణ మన దేశ ప్రతిష్ఠను మరింతగా పెంచిందని వెల్లడించారు. ఇప్పుడు భారత సామర్థ్యాన్ని, నిర్వహణ కౌశలాన్ని దేశాలన్నీ కొనియాడుతున్నాయని తెలిపారు.
ప్రపంచానికి భారత్ ఇప్పుడు మిత్రదేశంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌ను మిత్రదేశంగా భావిస్తోందన్నారు. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన చెప్పారు. భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి చంద్రయాన్-3 ఒక గొప్ప నిదర్శనమన్నారు. భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి వందనాలు సమర్పిస్తున్నానన్నారు.
పార్లమెంట్ గొప్ప తనాన్ని వివరించిన మోడీ…!
స్వాతంత్య్రానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్‌గా ఉండేదన్నారు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు పార్లమెంటు భవనం వేదికగా నిలిచిందన్నారు. కొత్త భవనంలోకి వెళ్లినప్పటికీ ఈ భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందన్నారు. దేశంలో సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షిభూతంగా నిలిచిందన్నారు.
ఈ భవనంలో జరిగిన ప్రతి చర్చా భారత గతిని మార్చాయన్నారు. దేశ అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం మనకు కనిపిస్తుందన్నారు. భారత్ అభివృద్ధి వీచికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్నారు. 75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపరిచిందన్నారు.
పలు జ్ఞాపకాలను గుర్తు చేసిన ప్రధాని…!
ఈ భవనంతో మనందరికీ ఎన్నో తీపి, చేదు అనుభవాలు వున్నాయన్నారు. ఎన్ని చర్చలు, మరెన్నో వాదనలు వున్నప్పటికీ ఈ భవనం మన గౌరవాన్ని పెంచిందన్నారు. తాను తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా వచ్చినప్పుడు ఈ భవనంలో గడపకు శిరస్సు వంచి నమస్కారం చేశానన్నారు. ఈ భవనం భారత ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు.
పార్లమెంట్ పై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇది పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి కాదన్నారు. ఇది ప్రజాస్వామ్య మాతృమూర్తి అని ఆయన అభివర్ణించారు. ఆ దాడిని భారత్ ఎప్పుడూ మరిచిపోదన్నారు. పార్లమెంట్ ను కాపాడేందుకు తమ గుండెలను తూటాలకు అడ్దుపెట్టిన వీరులకు తాను శిరసు వంచి సలాం చేస్తున్నానన్నారు.
అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించింది….!
ఈ దేశంలోని అన్నివర్గాల ప్రజల భావనలకు ఈ భవనం ప్రతీకగా నిలిచిందన్నారు. ఒక రైల్వే ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ సభలో అత్యున్నత స్థానం లభించిందన్నారు. ఇది భారత ప్రజాస్వామ్య చేతనకు నిదర్శనమన్నారు. దళితులు, ఆదివాసీలు, మధ్యతరగతి, మహిళలకు ఈ సభ అవకాశం కల్పించిందన్నారు.
పాత తరం నేతలను గుర్తు చేసిన మోడీ…!
ఈ సభకు 17 మంది స్పీకర్లు నేతృత్వం వహించారన్నారు. మౌలంకర్ నుంచి సుమిత్రా మహాజన్ వరకు ఈ సభకు పలువురు దిశానిర్దేశం చేశారన్నారు. స్ట్రోక్ ఆఫ్ ద మిడ్‌నైట్ అన్న పండిట్ నెహ్రూ స్వరం ఇప్పటికీ మన చెవుల్లో నిరంతరం మారుమోగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయనా.. కేవలం ఈ దేశం మాత్రమే శాశ్వతమన్న వాజ్‌పేయీ మాటలు నిరంతరం మన మనస్సులో మారుమోగుతుంటాయన్నారు.
ఈ సభలో కేవలం నలుగురు సభ్యులున్న పార్టీలు సైతం అధికారంలో భాగస్వాములు అయ్యాయన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన సందర్భాలున్నాయన్నారు. మొరార్జీ దేశాయి, వీపీ సింగ్ జీవితకాలం కాంగ్రెస్‌లో ఉండి.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాజకీయాలను విరమించుకుని సన్యాసం తీసుకోవాలనుకున్న పీవీ ప్రధానిగా దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారన్నారు.