అయోధ్య (Ayodhya)లో రామ మందిరానికి అంకితం చేసిన స్మారక తపాల స్టాంపు (Postal Stamp)లను, ప్రపంచ వ్యాప్తంగా రామున్ని గౌరవిస్తూ విడుదల చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈ రోజు విడుదల చేశారు. ఇందులో మొత్తం 48 పేజీలు ఉన్నాయి.
వాటిలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, యూఎన్ వంటి సంస్థలతో సహా 20 దేశాలకు పైగా దేశాలు జారీ చేసిన స్టాంపులను ఇందులో పొందుపరిచారు. స్టాంపులను, పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ….. ఈరోజు శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ నిర్వహిస్తున్న మరో అద్భుతమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం తనకు లభించిందని వెల్లడించారు.
శ్రీ రామ జన్మభూమి మందిర్‌పై 6 స్మారక తపాలా స్టాంపులు, ప్రపంచవ్యాప్తంగా రాముడిపై విడుదల చేసిన స్టాంపుల ఆల్బమ్‌ను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ఆరు స్టాంపుల్లో రామాయణంలోని కీలకమైన వ్యక్తులు, అంశాలను సూచిస్తాయని వివరించారు.
వీటిలో రామాలయం, గణేశ్, హనుమాన్, జటాయు, కేవత్రాజ్, మాత శబరిపై స్టాంపులు ఉన్నాయని పేర్కొన్నారు. వివిధ సమాజాలపై భగవాన్ శ్రీరాముడి ప్రభావం ఎలా ఉందో తెలిపేందుకు గాను ఈ స్టాంప్ బుక్ ను విడుదల చేశారు. ఈ స్టాంపుల రూపకల్పనలో శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలకు చోటు కల్పించారు.