అయోధ్య (Ayodhya)లో బాల రామున్ని ప్రతిష్టించుకున్న సందర్బంగా ప్రతి ఒక్కరూ రామ జ్యోతి (Rama Jyothi)ని వెలిగించాలని ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) పిలుపి నిచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ తన నివాసంలో బాల రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి రామ జ్యోతిని వెలిగించారు. ప్రధాని మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర బీజేపీ నేతలు రామ జ్యోతిని వెలిగించారు.
ప్రధాని మోడీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో అయోధ్య ఆలయం నుంచి తీసుకు వచ్చిన ఫోటో ఎదుట దీపాలను వెలిగించారు. దీనికి సంబంధించిన పోటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ పవిత్రోత్సవానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో రామ జ్యోతిని వెలిగించి మినీ దీపావళిని జరుపుకోవాలని భక్తులను మోడీ కోరారు.
అటు రక్షణ శాఖ మంత్రి కూడా తన నివాసంలో రామ జ్యోతి వెలిగిస్తున్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు. ఈరోజు రామ్ లల్లా అయోధ్య ధామ్‌లోని తన కొత్త, దివ్యమైన, గొప్ప ఆలయంలో కూర్చున్నారని అన్నారు. ఈ రోజు దేశం మొత్తం దీపావళి పండుగను జరుపుకుంటోందని చెప్పారు. ఈ శుభ సందర్భంలో కుటుంబంతో కలిసి ఇంట్లో ‘రామజ్యోతి’ వెలిగిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు దివ్యాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విద్యార్థులతో కలిసి మంత్రి గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇక్కడ తన నివాసంలో ‘దియా’ వెలిగించారు. ఇది ‘చరిత్రాత్మకమైన రోజు’ అని పేర్కొన్నారు.