దేశ ప్రధాని మోడీ (PM Modi) తాను చేసే ప్రత్యేకమైన పనుల వల్ల ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండటం తెలిసిందే.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా.. ఈ ఏడాది లక్షదీప్ పర్యటనలో సాహసంతో కూడిన స్విమ్మింగ్, స్నార్కెలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా నేడు గుజరాత్ (Gujarath) తీరంలోని అరేబియా సముద్రంలో మరో డేరింగ్ స్టంట్ చేశారు. అంతా ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు.
ఈ డైవింగ్‌కు సంబంధించిన చిత్రాలను ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేశారు. డైవింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలను జతచేశారు. సాహసోపేతమైన స్టంట్ కోసం స్కూబా (Scuba) గేర్ ధరించిన ప్రధాని, పలువురు డైవర్ల సాయంతో లోపలికి వెళ్లారు. నెమలి ఈకలతో వెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు. మరోవైపు నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం దివ్యమైన అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
నేను ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రంలోని ద్వారకా నగరాన్ని (Dwarka Nagaram) సందర్శించాలని అనుకొన్నా. అక్కడకు చేరుకొని ప్రార్థనలు చేయాలనే కోరిక ఉండేది. ఎట్టకేలకు అది ఈరోజు నెరవేరిందని తెలిపారు.. సముద్ర గర్భంలోకి వెళ్లే సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యానని మోడీ వెల్లడించారు. కాగా స్కూబా డైవింగ్ అనంతరం అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అదీగాక ఏపీలోని మంగళగిరి వద్ద నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక మీద నుంచి పంజాబ్‌లోని బఠిండా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, బంగాల్ నుంచి కల్యాణి, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిమ్స్ ఆస్పత్రుల (AIIMS Hospitals)ను ప్రారంభించారు. ఈ నాలుగు ఆస్పత్రులను జాతికి అంకితం చేశారు.
మరోవైపు రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో 23 రాష్ట్రాల్లో నిర్మించనున్న 200 ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేశారు. వీటన్నింటినీ గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.