ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ (Startup Eco System) భారత్‌లో ఉందని ప్రధాని మోడీ (Modi) అన్నారు. నేడు ఢిల్లీ (Delhi)లో జరిగిన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ (Congress)పై విమర్శలకు దిగారు.. రాజకీయ స్టార్టప్‌లను లాంఛ్ చేయాలని చాలా మంది పలుమార్లు ప్రయత్నించారని తెలిపారు.. కానీ అలాంటి వారికి మీకు మధ్య వ్యత్యాసం నింగికి నెలకు ఉన్నంత అని అన్నారు..
మీరు నూతన ఆలోచనల వెంట పరుగులు పెడుతుంటారని, కానీ అలాంటి వారు మంచి ఆలోచనలు నాశనం చేసే దిశగా ఆలోచిస్తారని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటోందని, వినూత్న రీతిలో అభివృద్ధి దిశగా పురోగిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగం దేశంలో తనదైన ముద్రవేసుకోందని పేర్కొన్నారు..
దేశం వికసిత్ భారత్- 2047 దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాకుంభ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకొని ఉందన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. స్టాల్స్‌ను కలియ తిరుగుతూ మీ ఆవిష్కరణలను చూసిన అనంతరం భారత్ రాబోయే రోజుల్లో ఎన్నో యూని కార్న్‌లు, డెకా కార్న్లకు వేదిక కానుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వృద్ధి మెట్రో నగరాలకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా సామాజిక సంస్కృతిగా విస్తరించిందన్నారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ప్రధాని వివరించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రమని, దేశంలో 1.25 లక్షలకు పైగా నమోదిత స్టార్టప్‌లున్నాయని వెల్లడించారు. కాగా స్టార్టప్‌ల్లో 12 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారని పేర్కొన్నారు.