ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ (India) ఐదవ స్థానంలో ఉందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. ఇప్పుడు ప్రపంచానికి భారత్ ఒక ఆశాదీపంగా మారిందని తెలిపారు. పెద్ద పెద్ద పెటుబడిదారులు ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తమిళనాడుతో పాటు ఈ దేశ ప్రజలు దాని నుంచి లబ్ది పొందుతున్నారని వెల్లడించారు.
ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాకు తమిళనాడు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు. ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తిరుచిరాపల్లిలోని భారతి దాసన్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ చేరుకోగా సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనకు స్వాగతం పలికారు. వర్శిటీలో 38 వ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం 1100కోట్లతో అభివృద్ధి చేసిన తిరుచరపల్లి ఎయిర్ పోర్టును ఆయన ప్రారంభించారు.
తమిళనాడులో 19,850 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ….. గడిచిన ఏడాది కాలంలో 40కి పైగా కేంద్ర మంత్రులు తమిళనాడును సందర్శించారని తెలిపారు. తమిళనాడు వేగంగా అభివృద్ది చెందితే భారత్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 2004-14 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడుకు 30 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కానీ గత పదేండ్లలో తమ ప్రభుత్వం తమిళనాడుకు 120 లక్షల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు.
తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను తమ ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు. ఇప్పడు ఆ ప్రాంతాల్లో మత్స్య కారుల జీవితాలు మారి పోయాయని వివరించారు. మొట్ట మొదటి సారిగా మత్స్య శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించామన్నారు. దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని పేర్కొన్నారు. ‘మిచాంగ్’ తుపాన్ తో దెబ్బతిన్న తమిళ ప్రజల దుస్థితిని తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్రం వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.