రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Mann Ki Bath) ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రోజుల క్రితం 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకొన్నామని తెలిపారు. ఈ రిపబ్లిక్ డే తో.. రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకొన్నాయన్నారు.. రామ మందిరంలో ప్రతిష్టాపన కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించారు.
కోట్లాది మంది దేశ ప్రజలను ఒక్కతాటిపైకి అయోధ్య ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తెచ్చిందని పేర్కొన్నారు. అందరి భావాలు ఒక్కటే, అందరి భక్తి ఒక్కటే, అందరి మాటల్లో రాముడు ఉన్నారని తెలిపారు. జనవరి 22 సాయంత్రం దేశం మొత్తం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరుపుకొందని అన్నారు. అంతేకాకుండా జనవరి 26న జరిగిన కవాతు చాలా అద్భుతంగా సాగిందని మోడీ తెలిపారు.
మహిళా అథ్లెట్లు ఎన్నో పెద్ద టోర్నమెంట్లలో పాల్గొని భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లకు అర్జున అవార్డు లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. మూడు రోజుల క్రితం, దేశం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తులకు పద్మ గౌరవాలు ఇస్తున్నారన్నారు.
ఈ వ్యక్తులు మీడియాకు దూరంగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. పద్మ అవార్డు ప్రకటించిన తర్వాత ఇలాంటి వారిపై సర్వత్రా చర్చ జరగడం సంతోషకరమని మోడీ అన్నారు. ఇక దేశంలోని మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈసారి ఛత్తీస్గఢ్ (Chhattisgarh)కు చెందిన హేమ్చంద్ మాంఝీ కూడా పద్మ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు..