ప్రధాని నరేంద్ర మోడీ(PM MODI) సోమవారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల అధికారులు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందే మోడీ శ్రీవారిని దర్శించుకొని అతిథిగృహం చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తిరుమలలో ప్రధాని రాక సందర్భంగా 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని మోడీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మహాద్వారం దగ్గర ఘన స్వాగతం పలికారు.
ఆలయ పండితుల నుంచి ప్రధాని మోడీ వేద ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మోడీకి ప్రసాదం అందజేశారు. అనంతరం శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు ప్రధానికి అందజేశారు. ఆయన 50నిమిషాల పాటు తిరుమల ఆలయ ప్రాంగణంలో గడిపారు.
కాసేపటి విరామం అనంతరం ప్రధాని తెలంగాణకు బయలుదేరనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రధాని వెళ్లే మార్గాల్లో దుకాణాలను మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. మరోవైపు మీడియాకూ అనుమతి కల్పించలేదు. ప్రధాని హోదాలో మోడీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి.