‘ఫిర్ ఏక్ బార్ మోడీ’ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) తెలంగాణ(Telangana) పర్యటన ఖరారైంది. వచ్చేనెల 4, 5వ తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఆయా జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ మేరకు 17పార్లమెంట్ నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర బీజేపీ యాత్రలు సాగనున్నాయి. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు ఉండనున్నాయి. మార్చి 2న ఈ యాత్రలు ముగియనున్నాయి. అయితే, ఈ యాత్రల ముగింపు సభకు ప్రధాని మోడీ రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మోడీ పర్యటనతో మార్చి 4వ తేదీన రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కొన్ని సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఖరారు చేసింది. మరోవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా షురూ చేసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కొన్ని స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా సర్వత్రా ప్రధాన్యత సంతరించుకొంది.