లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మాట్లాడుతూ.. ఇది ఎంతో మంచిరోజని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం మొదలైందని అభిప్రాయపడ్డారు. కాత్యాయని మాత రెండు భుజాలపై కమలం పువ్వులు ఉంటాయని, ఇవాళ అంబేడ్కర్ జయంతి కావడం విశేషమని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఈ విశేషాలన్నీ కలగలిపిన ఈ రోజు బీజేపీ సంకల్ప పత్రాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు అని మోడీ అభివర్ణించారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉత్తమమైన మేనిఫెస్టోలో తయారు చేశారని, మేనిఫెస్టో కమిటీ సభ్యులకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలందరూ బీజేపీ సంకల్ప పత్రం(BJP Sankalpa Patra) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని అన్నారు.
ఇందులో నాలుగు ప్రధాన అంశాలైన యువశక్తి, నారిశక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజనపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు. యువత ఆకాంక్ష మేరకు బీజేపీ మేనిఫెస్టో ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
పేదలకు మరో 3కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటివరకు సబ్సిడీ ధరకు ప్రతీ ఇంటికి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పిన ఆయన భవిష్యత్తులో పైప్లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ సరఫరా చేస్తామని మోడీ ప్రకటించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం క్రీడలకు ప్రధాన్యమిస్తోందని తెలిపారు. 2036లో భారత్లో ఒలంపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.