అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. రామ్ లల్లా (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) తన అధికారిక ఖాతాలో ఓ సాంగ్ ను షేర్ చేశారు.
యువ సింగర్ ‘స్వస్తి మెహుల్’పాడిన రామ్ ఆయెంగే భజనను మోడీ షేర్ చేశారు. ఇటీవల స్వస్తి మెహుల్ తన పాటను శ్రీ రాముడికి అంకితం ఇచ్చారు. ఎంతో మంది మనసును ఈ పాట ఆకట్టుకుంది. తాజాగా ఈ పాటపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట చాలా పాపులర్ అవుతోందన్నారు.
దేశవ్యాప్తంగా రామ మందిర ప్రారంభోత్సన ఈవెంట్ పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచిందని తెలిపారు. ఈ కీర్తనను స్వస్తిజీ స్వరంలో ఒక్క సారి వింటే అది మన చెవుల్లో చాలా కాలం మారుమోగుతుందని చెప్పారు. ఈ పాట వినగానే మన మనస్సు ఒక ఉద్వేగానికి గురవుతుందని పేర్కొన్నారు. వెంటనే మన కండ్లలో నీళ్లు తిరుగుతాయని వెల్లడించారు.
ఈ పాటను ప్రధాని మోడీ షేర్ చేసిన కేవలం గంట సమయంలోనే మూడు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. ఇది ఇలా వుంటే అయోధ్యలో 10 నుంచి 15 వేల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రామ మందిర ప్రతిష్టాపనకు ముందు రాముని విగ్రహాన్ని రథంపై పెట్టి ఊరేగించనున్నారు.