అయోధ్య (Ayodhya )లో ‘రామ్ లల్లా’ (Ram Lalla)ప్రాణ ప్రతిష్టను నిన్న అత్యంత వైభవంగా నిర్వహించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ప్రధాని మోడీ (PM Modi) తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
జనవరి 22వ తేదీన అయోధ్యలో మనం ఏం చూశామో ఆ మధుర స్మృతులన్నీ చిరకాలం నిలిచిపోతాయంటూ దానికి క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక సమయంలో వేలాది మంది ప్రజలు రామ నామ జపం చేస్తున్న, ఆలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
మూడు నిమిషాలు ఉన్న వీడియోలో రెడ్ కార్పెట్ పై వెండి గొడుగు పట్టుకుని ఆలయ గర్భగుడిలోకి ప్రధాని వెళుతున్న దృశ్యాలను చూడవచ్చు. దీంతో పాటు రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని, రామ్ లల్లా విగ్రహం నుంచి ఆశీర్వాదం తీసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
రామ మందిర ఉద్యమంలో ప్రముఖ నాయకురాలు సాధ్వి రితంభర ‘ప్రాణ ప్రతిష్ఠ’ సమయంలో భావోద్వేగంతో కంటతడి పెట్టారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గోన్న కార్మికులను గౌరవిస్తూ వారిపై ప్రధాని మోడీ పూల వర్షం కురిపించారు. వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి.