ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఎక్స్(ట్విట్టర్) ద్వారా మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు షెహబాజ్ షరీఫు అభినందనలు.. అంటూ ప్రధాని పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న జరిగిన పాక్ ఎన్నికల్లో షరీఫ్‌నకు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ రెండో స్థానంలో నిలిచింది. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు.
అయితే పార్లమెంటులో మెజారిటీని పొందలేకపోయారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల రోజుల తర్వాత షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ.. షరీఫ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.
అధ్యక్ష భవనంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, పీపీపీ చైర్మన్ బిలావాల్ భుట్టో హాజరయ్యారు. ఇక షెహబాజ్ గతంలోనూ పాక్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు ఆయన తొలిసారి ప్రధాని బాధ్యతలను నిర్వర్తించారు.