Telugu News » మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి తెరదించుతా….!

మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి తెరదించుతా….!

మాదిగల హక్కుల పోరాటం గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా తెరదించుతానని స్పష్టం చేశారు.

by Ramu
PM Modi: Prime Minister Modi's visit to Telangana today.. this is the schedule..!

-ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది
-వర్గీకరణపై కమిటీ వేస్తాం
-సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మా ప్రభుత్వ నినాదం
-మా తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన
-వన్ లైఫ్, వన్ మిషన్ తో మందకృష్ణ పనిచేస్తున్నారు
-బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు
-అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించింది
-బాబూ జగజ్జీవన్ రామ్ ను అవమానించింది
–దళిత సీఎం అని బీఆర్ఎస్ మోసం చేసింది
-కొత్త రాజ్యాంగం అంటూ అంబేడ్కర్ ను కేసీఆర్ అవమానించారు
-దళితులంటే ఇండియా కూటమికి చిన్న చూపు
-ఏ రాజకీయ పార్టీ మాదిగల బాధను అర్థం చేసుకోలేదు
– మాదిగలను రాజకీయంగా వాడుకుని వదిలేశారు
-రాజకీయ నాయకుల పాపాలను కడిగేందుకు నేను ఇక్కడకు వచ్చా
-మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ…!

తెలంగాణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం తనను కలిచి వేసిందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ మాదిగ సమాజానికి జరిగన అన్యాయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. మాదిగల హక్కుల పోరాటం గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా తెరదించుతానని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామన్నారు.

సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… స్వాతంత్ర్యం తర్వాత మీరు చాలా ప్రభుత్వాలను చూశారాని ప్రధాని మోడీ అన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదం ఇచ్చిందన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే తపనతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుర్రం జాషువా తన బాధలను కాశీలోని బాబా విశ్వనాథ్ కు మొర పెట్టుకున్నారని అన్నారు.

ఆ జాషువాను ప్రేరణగా తీసుకుని… ఏ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామో ఖచ్చితంగా ఆ దిశలో అడుగులు వేస్తున్నామన్నారు. అందుకే తాను ఈ రోజు మీ మధ్యకు వచ్చానన్నారు. తమ ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తామన్నారు. 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ పోరాడుతున్నారని చెప్పారు.

వన్ లైఫ్.. వన్ మిషన్‌తో మంద కృష్ణ పోరాడుతున్నారని వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీ మాదిగల బాధను అర్థం చేసుకోలేదన్నారు. మాదిగలకు తాను తోడుగా ఉంటానన్నారు. తాను మాదిగలను ఏదీ కోరడానికి ఇక్కడకు రాలేదన్నారు. కేవలం మీ బాధలను పంచుకునేందుకు వచ్చానన్నారు. అనేక రాజకీయ పార్టీలు మీకు అనేక హామీలు ఇచ్చాయన్నారు. మిమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారని, చివరకు మోసం చేశాయన్నారు.

వాళ్లు చేసిన పాపాలకు ఓ రాజకీయ నాయకుడిగా ప్రక్షాళన చేసేందుకు తాను మీతో ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై మీరు ఏమీ అడగాల్సిన అవసరం లేదన్నారు. దళితున్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారన్నారు. దళిత బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గౌరవాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయిందన్నారు. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని చెప్పారు.

బలిదానాలతో తెలంగాణ వస్తే కాంగ్రెస్‌కు థ్యాంక్స్ చెప్పారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై దోపిడీ జరిగిందన్నారు. కొత్త రాజ్యాంగం పేరుతో అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారని ఫైర్ అయ్యారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి కనీసం నివాళులు కూడా అర్పించలేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దళిత వ్యతిరేక పార్టీలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలతో మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అంబేడ్కర్ ను వ్యతిరేకించి ఓడించిన పార్టీ కాంగ్రెస్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ హాల్‌లో అంబేడ్కర్ చిత్ర పటాన్ని కాంగ్రెస్ పెట్టనివ్వలేదన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. బీజేపీ హయాంలోనే పార్లమెంట్ లో అంబేడ్కర్ ఫోటో పెట్టామన్నారు. బీజేపీ హయాంలోనే అంబేడ్కర్ కు భారత రత్న ప్రకటించామన్నారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామన్నారు.

రాష్ట్రపతిగా ఆదివాసి మహిళను తాము ప్రతిపాదించామన్నారు. కాంగ్రెస్ ఆమెను కూడా అవమానించిందన్నారు. రాజస్థాన్‌లో పుట్టి తెలంగాణను కర్మభూమిగా భావించిన దళిత అధికారి హీరాలాల్ సమారియాను కేంద్ర సమాచార కమిషనర్ గా నియమించి అత్యంత ఉన్నత పదవిని ఇచ్చామన్నారు. అప్పుడు కూడా తమ ప్రతిపాదనను కాంగ్రెస్ ఇష్టపడలేదన్నారు. వెంటనే ఆ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించిందన్నారు.

బిహార్‌లో దళిత నేతను సీఎం నితీశ్ కుమార్ అవమానించారన్నారు. దళితులంటే ఇండియా కూటమి చిన్న చూపు అన్నారు. తన మిత్రుడు దళిత నాయకుడు రాం విలాస్ పాశ్వాన్ ను కూడా అవమానించారన్నారు. ఆయనకు రాజ్య సభ సీటు ఇచ్చే విషయంలో తాము ఆయన్ని సమర్థించగా, నితీశ్ కుమార్ వ్యతిరేకించారని ఆయన మండిపడ్డారు. జీతన్ రామ్ మాంఝీ అనే దళిత నాయకున్ని అసెంబ్లీలో నితీశ్ కుమార్ ఘోరంగా అవమానించారన్నారు. మీరు సీఎంకు అనర్హులంటూ జీతన్ రామ్ పై నితీశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇండియా కూటమి నేతలకు దళితులంటే చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలోని ఆప్ తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. లిక్కర్ స్కామ్‌లో రెండు పార్టీల ప్రమేయం ఉందన్నారు. అవినీతిలో ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అవినీతికి నిదర్శనమన్నారు. ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయన్నారు. ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్టు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీనే అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓ వైపు బీజేపీ మరోవైపు అన్నారు. అధికారం కోసం ఆ రెండు పార్టీలు తహతహలాడుతున్నాయన్నారు. స్టాండప్ ఇండియా ద్వారా దళితులకు చేయూత ఇచ్చామన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. ఉచిత రేషన్‌ను మరో ఐదేండ్లు పొడిగించామన్నారు. దీంతో 80 కోట్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 24 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు అన్నారు.

తెలంగాణలో మీకు జరుగుతున్న అన్యాయం తనను కలిచి వేసిందన్నారు. మాదిగల బిడ్డ బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో తాను పనిచేశానన్నారు. ఓ కార్యకర్తగా ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. బియ్యం కొనుగోలుకు ఎన్నికల కోడ్ అడ్డురాదన్నారు. కనీస మద్దతు ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు అన్యాయం చేయవద్దంటూ బీఆర్ఎస్ సర్కార్ ను కోరారు.

తెలంగాణ మాదిగ సమాజానికి జరిగిన అన్యాయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానన్నారు. 30 ఏండ్లుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నాడన్నారు. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా తాను కూడా పని చేస్తానని చెప్పారు. మందకృష్ణ తల్లిదండ్రులకు తాను నమస్కారాలు చేస్తున్నట్టు తెలిపారు.

మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా తెరదించుతామన్నారు. మీ హక్కుల కోసం చేసే పోరాటాన్ని తాము గుర్తించామన్నారు. మీ పోరాటం గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. అనేక మంది తమ హక్కుల కోసం దీర్ఘకాలికంగా చేసిన పోరాటం తమకు తెలుసన్నారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై విషయంపై ఓ కమిటీ వేస్తామన్నారు. ఆ కమిటీ ద్వారా మిమ్మల్ని సంఘటిత పరిచేందుకు ఓ కొత్త మార్గాన్ని ఏర్పరుస్తామన్నారు. ఒక పెద్ద న్యాయపరమైన ప్రక్రియ సుప్రీం కోర్టులో కొనసాగుతోందన్నారు. మీ పోరాటం న్యాయపరమైందనిగా గుర్తిస్తామన్నారు.

వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామన్నారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సామాజిక న్యాయానికి బీజేపీ గ్యారెంటీ ఇస్తోందన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించరన్నారు. న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగం తమకు ఇచ్చిందన్నారు. తాము ఖచ్చితంగా మాదిగల మార్గాన్ని సుగమం చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అన్నారు. భారత ప్రభుత్వం పూర్తి పకడ్బందీతో, పూర్తి చితశుద్దితో న్యాయం వైపే నిలబడుతుందని హామీ ఇచ్చారు.

 

You may also like

Leave a Comment