వారణాసి (Varanasi) పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విపక్ష ఇండియా కూటమి (India Alliance)పై విరుచుకు పడ్డారు. వారి కుటుంబాల కోసం ఇండియా కూటమి పనిచేస్తుందని విమర్శించారు. పేదల సంక్షేమం వారికి అవసరం లేదని.. సొంత ప్రయోజనాలు ఆశించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కులం పేరుతో కలహాలకు దిగుతూ దళితులు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన పధకాలను విపక్ష కూటమి వ్యతిరేకిస్తోందని యూపీ వారణాసి వేదికగా మోడీ దుయ్యబట్టారు. ఒక లక్ష్యం అంటూ లేకుండా.. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో వారు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. అందుకే పేదల సంక్షేమం పేరుతో విపక్ష నేతలు తమ కుటుంబాల కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. సంత్ రవిదాస్ జీ ఆలోచనలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని పేర్కొన్నారు. కుటుంబ పాలనకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పధకాలు అందరికీ వర్తిస్తాయని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేశారు.
సమాజంలో సమానత్వం సిద్ధించాలంటే.. అణగారిన వర్గాలకు ప్రాధాన్యత దక్కాలని.. అది ఒక బీజేపీ (BJP)తో సాధ్యమని వివరించారు. గత పదేండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న వర్గాలను కలుపుకు పోయేలా ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని వెల్లడించారు.. గతంలో పేదలను చివరి వ్యక్తులుగా చూసే పరిస్ధితి ఉండేదని, తమ హయాంలో వారికోసం భారీ పధకాలకు రూపకల్పన చేశామని ప్రధాని మోడీ వివరించారు.. అందరూ సమానం అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు..