Telugu News » BJP : మరోసారి రాష్ట్రానికి మోడీ.. బీజేపీ ప్లాన్ అదేనా?

BJP : మరోసారి రాష్ట్రానికి మోడీ.. బీజేపీ ప్లాన్ అదేనా?

పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభకు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా చూస్తున్నట్టు సమాచారం. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగుతోంది. తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

by admin

– రేపు మాదిగ విశ్వరూప బహిరంగ సభ
– హాజరు కానున్న ప్రధాని మోడీ
– మొన్న బీసీలపై వరాల జల్లు
– ఇప్పుడు మాదిగలకు సంబంధించి..
– కీలక ప్రకటన చేసే ఛాన్స్
– పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్న కమలనాథులు
– అన్ని వర్గాలను మచ్చిక చేసుకునే ప్లాన్స్
– కానీ, ఎస్సీ మోర్చా నేతల తీరుపై అనుమానాలు
– మోడీ సభకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం

ఎట్టకేలకు అభ్యర్థుల ప్రక్రియను పూర్తి చేసింది బీజేపీ (BJP). జనసేన (Janasena) తో పొత్తు నేపథ్యంలో ఆపార్టీకి కేటాయించిన సీట్లు మినహా మిగిలిన వాటికి అభ్యర్థులను ఖరారు చేసింది. పోలింగ్ కు తక్కువ రోజులే ఉండడంతో ప్రచారంలో మరింత జోష్ పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తూ.. జాతీయ నేతలను రాష్ట్రానికి తీసుకొస్తోంది. కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, ఇతర కీలక నేతలు తెలంగాణ (Telangana) బాటపట్టారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ను నమ్మొద్దని.. బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని మోడీ (PM Modi).

PM Modi To Attend Madiga Vishwarupa Sabha Tomorrow In Hyderabad

మోడీ షెడ్యూల్

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగ విశ్వరూప బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి వస్తున్నారు ప్రధాని. శనివారం సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. 5 గంటల నుండి 5.40 వరకు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. మొన్న బీసీ సభ కోసం రాష్ట్రానికి వచ్చిన మోడీ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి ఆయన స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది.

మొన్న బీసీ.. ఇప్పుడు మాదిగ..

తెలంగాణలో గెలుపు జెండా ఎగురవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఈసారి జనం మార్పు కోరుకుంటున్నారని.. పక్కాగా బీజేపీ గెలుస్తుందని ధీమాతో ఉన్నారు కమలనాథులు. ఈ క్రమంలో బీసీ మంత్రాన్ని అందుకుంది బీజేపీ. ముందుగా బీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా బీసీలకు అధిక సీట్లు కేటాయించింది. తర్వాత బీసీ సీఎం నినాదం ఎత్తుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకుని గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తోంది. ఇప్పుడు మాదగలను కూడా ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మాదిగ విశ్వరూప బహిరంగ సభకు మోడీ వస్తున్నట్టుగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎస్సీ మోర్చాతో చిక్కులు తప్పవా?

పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభకు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా చూస్తున్నట్టు సమాచారం. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగుతోంది. తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు చెబుతున్నట్టుగా సమాచారం. పైగా టికెట్ల విషయంలో అసంతృప్తితో ఉన్న వీరు మోడీ సభకు హాజరవుతారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.

You may also like

Leave a Comment