ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ దార్శనికతకు అనుగుణంగా రేపు నమోఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం (Kashi Tamil Sangamam) 2023ను ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కన్యాకుమారి – వారణాసి తమిళ సంగమం రైలును కూడా ప్రధాన మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నెల 30 వరకు కాశీ తమిళ సంగమం కొనసాగనుంది.
ఈ సంగమంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కాశీ, తమిళనాడు మధ్య అనుసంధానంపై విద్యార్థులకు డిసెంబర్ నెలలో తమిళనాడు అంతటా ఉపన్యాసాలు, వర్క్‌షాప్ లను ఈ నెల 17 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 1400 మంది ప్రతినిధులు (7 గ్రూపుల్లో 200 మంది చొప్పున) కాశీకి చేరుకుంటారని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడు గ్రూపులకు దేశంలో ప్రముఖ నదులైన గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సిందూ, కావేరి పేర్లు పెట్టారు. వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, మత ప్రభోదకులు, రచయితలు, ప్రొఫెనల్స్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 15న వారు వారణాసికి బయలు దేరినట్టు పేర్కొన్నారు.
మొత్తం 8 రోజుల పాటు ప్రతినిధులు వారణాసి పర్యటన ఉంటుందని తెలిపారు. అందులో రెండు రోజులు వారణాసికి ప్రయాణానికి, రెండు రోజులు తిరుగు ప్రయణానికి, వారణాసిలో మరో రోజుల పర్యటన ఉంటుందన్నారు. ఈ నెల 20న ఉపాధ్యాయులకు ప్రత్యేక సెషన్, 22న ప్రొఫెషనల్స్ కు, 24న ఆలయాల కళా సంస్కతి, ధర్మాలపై, 26న రైతులు, కళాకారులకు, 28న వ్యాపారవేత్తలకు ప్రత్యేక సెషన్స్ ఉంటాయన్నారు.
ఒకప్పుడు కాశీలోని ఘాట్‌లు పండితుల కబుర్లు, పాండిత్య చర్చలకు సాక్షిగా ఉండేవి. అటు తమిళనాడు సంస్కృతి, కళలు, హస్తకళలు, సాహిత్యాలకు కేంద్రంగా ఉండేది. కాశీ, కంచి పురాతన కాలం నుంచి అత్యున్నత విద్యా పీఠాలుగా ఉన్నాయి. కాశీ ఉన్నత విద్యకు కేంద్రంగా ఉంటే, తమిళనాడు అనువర్తిత జ్ఞానాని నిలయంగా ఉండేంది. దేశంలో కాశీ, తమిళనాడు రెండు ప్రాంతాలు భారతదేశ విజ్ఞాన వారసత్వానికి కేంద్రాలుగా పని చేశాయి.
ఈ క్రమంలో పురాతన జ్ఞానాన్ని తిరిగి పొందడం, వాటికి ఆధునిక ఆలోచనలు తత్వశాస్త్రం, విద్యావేత్తలు, సాంకేతికత, వ్యవస్థాపకత, హస్తకళ మొదలైన వాటితో సమగ్రపరచి విలువైన జ్ఞానాన్ని సృష్టించడం వల్ల దేశానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ క్రమంలో కాశీ, తమిళనాడు మధ్య సాహిత్యం, రెండు ప్రాంతాల బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ చొరవ తీసుకున్నారు.
ప్రధాని చొరవ మేరకు తమిళనాడు ,కాశీ మధ్య సంబంధాలను పునరుద్దరించి, వాటిని పటిష్ట పరిచేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు కాశీ తమిళ సంఘమం పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు సమావేశాలను నిర్వహించనున్నారు.