ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఈ రోజు గుజరాత్, వారణాసిలో పర్యటించారు. మొదట గుజరాత్ లోని సూరత్‌లో పర్యటించిన ప్రధాని అక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. సూరత్‌లో వజ్ర పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని మోడీ వెల్లడించారు.
తాను మూడవ సారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని తాను గ్యారెంటీ ఇస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు లబ్ది చేకూర్చేలా మేడ్ ఇన్ ఇండియా ఒక సాధికారిక బ్రాండ్ గా మారిందన్నారు. అనంతరం సూరత్‌లో నూతనంగా నిర్మించిన సూరత్ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
గెట్ వే ఆఫ్ సూరత్ గా చెబుతున్న ఈ టెర్మినల్ బిల్డింగ్ రద్దీ సమయాల్లో 1200 దేశీయ, 600 మది విదేశీ ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారణాసి-ఢిల్లీ మధ్య రెండవ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అక్కడి నుంచి వారణాసికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగీలు ఘన స్వాగతం పలికారు.
వారణాసిలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఒక అంబులెన్స్ అదే రోడులో వచ్చింది. దీంతో అంబులెన్స్ ను గమనించి ప్రధాని మోడీ కాన్వాయ్ పక్కకు తప్పుకుని అంబులెన్స్ కు దారి ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత వారణాసిలోని వికసిత్ భారత్ సంకల్స్ యాత్ర ఎగ్జిబిషన్లో మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ప్రభుత్వం, రాజకీయాలు, సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న దేశంలోని ప్రజలందరూ ఈ వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నారన తెలిపారు. వారణాసి ఎంపీగా ఈ కార్యక్రమానికి సమయం ఇవ్వాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని వెల్లడించారు. అనంతరం కాశీ తమిళనాడు సంగమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.