దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ (Congress) కథనాలు సృష్టిస్తోందని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. దేశాన్ని ఇప్పుడు “ఉత్తర-దక్షిణ భారత్‌గా విభజించేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని అన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు దాటవని టీఎంసీ చీఫ్ అన్నారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా రాజ్య సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ….. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే చాలా సుదీర్ఘంగా మాట్లాడారని అన్నారు. ఆయన అంత సమయం ఎలా మాట్లాడారని ఆలోచించానని ఎద్దేవా చేశారు. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు.
బ్రిటీష్ పాలకుల స్ఫూర్తితో ఆ పార్టీ ఆలోచనలు సాగుతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను చాలా ప్రశ్నలు అడగదలుచుకున్నానని అన్నారు. బ్రిటీష్ వారి నుండి ప్రేరణ పొందింది ఎవరు అని నిలదీశారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో వలసవాద మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు? అని నిప్పులు చెరిగారు. మీరు బ్రిటిష్ వారి నుండి స్ఫూర్తి పొందకపోతే, వారు రూపొందించిన ఐపీసీని ఎందుకు మార్చలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు రూపొందించిన వందలాది చట్టాలను ఎందుకు కొనసాగించడానికి అనుమతించారు? అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడే బీఆర్ అంబేద్కర్‌కు భారతరత్న వచ్చిందన్నారు. దళితులు, వెనుకబడినవారు, గిరిజనులకు కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖను ఉదహరిస్తూ, మొదటి ప్రధాని ఎలాంటి రిజర్వేషన్లకైనా వ్యతిరేకమన్నారు.
కాంగ్రెస్ తన అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా గొంతు నొక్కి చంపిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూడా రాత్రికి రాత్రే రద్దు చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ మంటగిలిపిందన్నారు. భారీ స్థాయిలో భారత భూభాగాన్ని శత్రు దేశాలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందని ఫైర్ అయ్యారు.