-దేశంలో వరుసగా మూడో సారి బీజేపీ సర్కార్
-మూడు రాష్ట్రాల్లో విజయంతో పెరిగిన గ్రాఫ్
-మోడీ చరిష్మాతో అదనపు ప్రయోజనం
-రామ మందిర ప్రారంభంతో పెరగనున్న మైలేజీ
-విపక్ష కూటమిలో కొరవడిన ఐక్యత
-కూటమి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు
-కమల వికాసం ఖాయం
-యూకే పత్రిక సంచలన కథనం.
దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కమలం వికసిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ‘మోడీ సర్కార్’ (Modi Governament) హ్యాట్రిక్ ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ హవా ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకు పోతాయని తెలిపాయి. తాజాగా బ్రిటన్ కు చెందిన గార్డియన్ (Guardian) పత్రిక నరేంద్ర మోడీపై సంచలన కథనాన్ని ప్రచురించింది.
రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ ‘హ్యాట్రిక్ విక్టరీ’ఖాయమని గార్డియన్ పత్రిక వెల్లడించింది. దేశంలో ఇప్పటికే అత్యంత బలమైన పార్టీగా బీజేపీ ఉందని పేర్కొంది. తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో బీజేపీకి మరింత బలం చేకూరిందని వెల్లడించింది. వీటికి తోడు ప్రధాని మోడీ చరిష్మా జతకలవడంతో బీజేపీ దూకుడును ఎవరు ఆపలేరని స్పష్టం చేసింది.
ఇక అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ హిందూ, జాతీయవాద ఎజెండాలను తీసుకుని ముందుకు వెళ్తోంది. తాజాగా రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో హిందు సామాజిక వర్గంలో బీజేపీ గ్రాఫ్ ఓ రేంజ్ కు పెరిగిపోయింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎన్నికల్లో కమల పార్టీ విజయం నల్లేరుపై నడకేనని ఎల్లీస్ పీటర్సన్ కథనం వెల్లడించింది.
దక్షిణ, తూర్పు భారత్‌లో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతంగా బలంగా ఉంది. ఈ అంశం కమలనాధుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో చూసినప్పుడు అది చాలా బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధించినప్పటికీ ఎన్నికల్లో ఆ ఫలితాల ప్రభావం పెద్దగా ఉండదని వివరించింది.
ఇక ఇటీవల ఏర్పడిన విపక్ష ఇండియా కూటమి ప్రభావం అంతగా కనిపించకపోవచ్చని చెబుతోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుతో పలు కీలక అంశాలపై ఆయా పార్టీల మధ్య ఐక్యత కుదరడం లేదని చెప్పింది. ఎన్నికల ముందు బీజేపీ వికసిత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించింది. బీజేపీ సాధించిన విజయాలు, అభివృద్ధిని ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఆ పార్టీకి మైలేజీని పెంచే అవకాశం ఉందని తెలిపింది.