PM : ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్ సభలో వీగిపోయింది. తీర్మానంపై చర్చకు మోడీ గురువారం సమాధానమిస్తుండగా మధ్యలోనే కాంగ్రెస్ ఆధ్వర్యాన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో మూజువాణీ ఓటుతో తీర్మానం వీగిపోయింది. చర్చ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడిన మోడీ.. మణిపూర్ త్వరలో ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మాట్లాడేది అని చెలరేగిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో తాను 50 సార్లు పర్యటించానని, వారు శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. భారత మాతను ముక్కలు చేస్తోంది విపక్షాలేనని , వందేమాతరం గీతాన్ని కూడా ముక్కలు చేశారని అన్నారు.
మణిపూర్ లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని అంటున్నారని, వాళ్ళ మనస్సులో ఏది ఉంటుందో అదే కనిపిస్తుందని పరోక్షంగా కాంగ్రెస్ ని ఉద్దేశించి అన్నారు. భారత మాత చావును వారెందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు.. భారత మాతను కాపాడాల్సినవారే భుజాలు నరికేశారు., కానీ ఇప్పుడు మేం మణిపూర్ పరిస్థితిని సరిదిద్దుతాం అని మోడీ వ్యాఖ్యానించారు.
మణిపూర్ పై అర్థవంతమైన చర్చ జరిపే ఉద్దేశం విపక్షాలకు లేదని, తాము చర్చకు ఆహ్వానించినా వారు పట్టించుకోలేదని అన్నారు. హైకోర్టు తీర్పు తరువాత మణిపూర్ లో పరిస్థితి మారిందని, ఆ తీర్పులో రెండు కోణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య భారతాన్ని చీకట్లో ఉంచేశారని నాడు లోహియా చెప్పారని, మిజోరం గాయాన్ని మాన్పించేందుకు కాంగ్రెస్ యత్నించలేదన్నారు. ఆ రాష్ట్రంలో 1966 లో జరిగిన ఘటనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, సామాన్య ప్రజలపై దాడులు జరిగాయని ఆయన చెప్పారు. మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలనన్నింటినీ శరవేగంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఈ అవిశ్వాసం మాకు శుభప్రదం
విపక్షాలు తమ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసం తమకు శుభప్రదమని మోడీ చెప్పారు. విపక్షం పెట్టిన అవిశ్వాసం తమపై కాదని, వాళ్లపై విశ్వాసం ఉందా లేదా అని తేల్చుకోవడానికేనని ఆయన సెటైర్ వేశారు. పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. మధ్య మధ్య మోడీ వేసిన చణుకులతో పాలక పార్టీ ఎంపీలు హర్షాతిరేకంతో బల్లలు చరిచారు.ఫీల్డింగ్ చేసింది వాళ్ళు.. (విపక్షాలు).. కానీ ఫోర్లు, సిక్సులు ఇక్కడ పడ్డాయి అని ఆయన వ్యాఖ్యానించారు. వారు తమను లెక్కలు అడగడం తమకు ఆశ్చర్యంగా ఉందని, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ ను చూస్తే జాలి వేస్తోందన్నారు. ‘నో కాన్ఫిడెన్స్..నో బాల్ .. నో బాల్ ‘గానే సాగిందని ఆయన చమత్కరించారు. అయిదేళ్ల సమయం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదని, శుభం జరుగుతున్న సమయంలో మీరు నల్ల దుస్తులు వేసుకు వచ్చి దిష్టి చుక్క పెట్టారని సున్నితంగా అక్షింతలు వేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలుతుందని, ఎల్ఐసి, హెచ్ఏఎల్ వంటి సంస్థలు మూతబడుతాయని వాళ్ళు ఆశించారని, కానీ అదేదీ జరగలేదన్నారు. కాంగ్రెస్ కి దూరదృష్టి గానీ, ఒక విజన్ గానీ లేదని చెప్పిన ఆయన.. మూడో ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలుపుతామన్నారు. పాకిస్తాన్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగిరేవని , తీవ్రవాదులు వస్తూ.. పోతూ ఉండేవారని, నిరంతరం కాల్పులు జరుగుతూ ఉండేవని మోడీ గుర్తు చేశారు. ఈ సారి అనేక కీలక బిల్లులు ఉన్న సమయంలో ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని మోడీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ డేటా బిల్లును ప్రస్తావించారు. ఇది దేశ యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘నాకు తెలిసి విపక్షాలకు ఒక వరం దొరికింది.. వారు ఎవరికి చెడు చేయాలనుకుంటారో వారికి కచ్చితంగా లాభమే జరుగుతుంది . దానికి నేనే పెద్ద ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. మ్యాచ్ మీరు మొదలు పెట్టారు.. ఆట మేం ఆడుతున్నాం.. అని కూడా ఆయన ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇండియాను ముక్కలుగా విడగొట్టారని అంటూ మొదటి ఐ లో 26 పార్టీల అహంకారం, రెండో ఐ లో కుటుంబ పాలన ఉన్నాయన్నారు. 2018 లోనూ తనపై విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని, కానీ ఆ తరువాత ప్రజలు తమకే పట్టం కట్టారన్నారు. 2028 లో మా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మోడీ విపక్షాలను ‘కోరారు’.
ఈ