కాంగ్రెస్ (Congress) విడుదల చేసిన ‘బ్లాక్ పేపర్’ (Black Paper)తమ ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. అది తమ ప్రభుత్వంపై దుష్ట చూపు తమపై పడకుండా కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ పని చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జు ఖర్గేకు ధన్యవాదాలు అని తెలిపారు.
గత పదేండ్లలో మోడీ సర్కార్ వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘బ్లాక్ పేపర్’పేరిట ఓ నివేదికను ప్రవేశ పెట్టారు. పలు రంగాల్లో మోడీ సర్కార్ వైఫల్యాలపై మొత్తం 54 పేజీల నివేదికను ఖర్గే విడుదల చేశారు. ఆ కొద్ది సేపటికే రాజ్య సభలో పదవీకాలం ముగియనున్న ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోడీ రాజ్యసభకు వెళ్లారు.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ బ్లాక్ పేపర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పదేండ్లలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి దిష్టి తాకకుండా ఉండేందుకు ఈ ‘బ్లాక్ పేపర్’ను ఓ దిష్టి చుక్కలాగా తీసుకుంటామని పేర్కొన్నారు.
దేశ ప్రగతి కోసం తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కోసం పెద్దాయన ఖర్గే ఈ దిష్టి చుక్కను పెట్టారని అన్నారు. ప్రతిపక్షాల చర్యను తాము స్వాగతిస్తున్నామని వివరించారు. అందుకు తాను ఖర్గే జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మరోవైపు యూపీఏ పాలనపై వైట్ పేపర్ విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మలా సీతారామన్ వెల్లడించారు.