పాకిస్థాన్ (Pakistan)లో న్యుమోనియా (Pneumonia) విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి శీతల గాలులతో ఇప్పటి వరకూ సుమారు 10 వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. పంజాబ్ ప్రావిన్స్ (Punjab province)లో 200 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహారలోపం, న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారేనని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రావిన్స్‌లో జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 10,520 న్యుమోనియా కేసులు నమోదైనట్లు శుక్రవారం వెల్లడించింది. మొత్తం 220మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలేనని స్పష్టం చేసింది. పంజాబ్ రాజధాని లాహోర్ (Lahore)లోనే 47 మంది చనిపోయినట్లు ప్రకటించింది. ఇక గతేడాది పంజాబ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా కారణంగా 990 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 31వరకు పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహణను ప్రభుత్వం నిషేధించింది.
పంజాబ్‌లోని ఇమ్యునైజేషన్‌పై ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ తమ దేశంలో పుట్టిన శిశువులకు ఆరు వారాల తర్వాత పిసివి అనే మొదటి యాంటీ-న్యుమోనియా వ్యాక్సిన్‌ని ఇస్తారని తెలిపారు. రెండు సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాక్సిన్ అనేక రకాల వ్యాధులపై పోరాడుతుందని చెప్పారు. ఈవ్యాధి కొవిడ్-19ను పోలి ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.