రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. లోక్ సమరంలో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఎవరికి వారే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేయడం కనిపిస్తోంది. మూడు ప్రధాన పార్టీ లీడర్ల మధ్య మాటలు అస్త్రాలుగా మార్చి ఒకరి మీద ఒకరు ప్రయోగించుకోవడం.. అది తాము తప్ప ప్రభుత్వం నడపడానికి మిగతా పార్టీలు పనికి రావనే స్థాయిలో విమర్శలు గుప్పించుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్, బాన్సువాడ (Banswada) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy).. కాంగ్రెస్ (Congress)పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు.. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ (KCR)కు తెలిసినట్టు ఎవరికి తెలియదన్న పోచారం.. అధికారం కోసం అప్పుడు.. ఓట్ల కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలను నమ్మించి వంచిస్తుందని ఆరోపించారు.. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని విమర్శించారు.. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు..
మరోవైపు రుణమాఫీపై భట్టి విక్రమార్క ఒక మాట, సీఎం రేవంత్ రెడ్డి మరోమాట మాట్లాడటం కనిపిస్తుందన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు.. అలాగే బీజేపీ వల్ల తెలంగాణకి ఒరిగింది ఏం లేదన్న ఆయన.. పదేళ్లుగా రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యిందని విమర్శించారు..