తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం(Pocharam Srinivas Reddy) శ్రీనివాస్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. స్పీకర్(Speaker)గా పనిచేసిన వారు అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారన్న సెంటిమెంట్ (Sentiment)ను పోచారం బ్రేక్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే.. మొన్నటి తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి వరకు కొనసాగిన ఆ సంప్రదాయానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఇక బాన్సువాడ నియోజకవర్గం నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం 2004 మినహా 1999, 2009, 2011 ఉపఎన్నికతోపాటు 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. నాటి స్పీకర్ కావాలి ప్రతిభా భారతి నుంచి మొన్నటి కోడెల శివప్రసాద్ రావు, మధుసూదనాచారి దాకా అందరూ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1999 నుంచి స్పీకర్లుగా పని చేసిన వారు ఒక్కరు కూడా ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయలేదు. 1999లో TDP ప్రభుత్వంలో కావలి ప్రతిభా భారతి స్పీకర్‌గా పని చేసి, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004 -09 వరకు స్పీకర్‌గా పనిచేసిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2009-10 వరకు స్పీకర్‌గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి పరాజయం చవిచూశారు. 2011-14 వరకు స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
అయితే, ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో పోచారం గెలిచారు. దీంతో భవిష్యత్తు ఏంటన్న వారికి ఆయన గట్టి సమాధానం చెప్పినట్లు అయింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీచినా.. పోచారం శ్రీనివాస్ రెడ్డికి లక్కు కలిసొచ్చింది. కాగా, బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం 23,582 ఓట్లతో ఘన విజయం సాధించారు.