– రిటైర్డ్ ఐఏఎస్ ఇంటికి నకిలీ డాక్యుమెంట్లు
– కబ్జా చేసే ప్రయత్నాలు
– పోలీసుల ముందుకు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్
– తనకేం తెలియదని వివరణ
– రంగంలోకి బీసీ సంఘాలు
– తప్పుడు ఫిర్యాదు.. అక్రమ అరెస్ట్ అంటూ నిరసన
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా, ఎస్పీగా ఈయన విధులు నిర్వహిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.
గత కొంత కాలంగా హైదరాబాద్ బేగంపేటలో భన్వర్ లాల్ ఇంట్లో నవీన్ కుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని కోరగా ఎస్పీ తన మాటలను లెక్క చేయడం లేదని భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. పైగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తమ ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఎస్పీ నవీన్ కుమార్ ను 41 సీఆర్పీసీ కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటున్నారు పోలీసులు. ఈనెల 22వ తేదీ ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఇదే కేసులో నవీన్ కుమార్ ను ఏ2గా చేర్చి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే.. తాను ఎలాంటి తప్పు చేయలేదని… ఇల్లు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని అన్నారు నవీన్. 2020 నుంచి ఈ వివాదం కొనసాగుతోందని… సివిల్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. సీసీఎస్ పోలీసులు వివరాల కోసం పిలిచారని.. తన దగ్గర ఉన్న సమాచారం ఇచ్చానని లీగల్ గా ముందుకెళ్తానని తెలిపారు. మరోవైపు, నవీన్ కుమార్ వ్యవహారంపై పలు బీసీ సంఘాలు, ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. తప్పుడు ఫిర్యాదుతో ఓ బీసీ ఐపీఎస్ అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన చేశారు.