మాదాపూర్ (Madhapur) మాదక ద్రవ్యాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా ఇద్దరిని పోలీసులు (Police) అరెస్టు చేశారు. ‘బస్తీ’చిత్ర దర్శకుడు (Film Director) మంతెన వాసు వర్మ , రచయిత (Writer) మన్నేరి పృథ్వీ కృష్ణను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 70 గ్రాముల మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇది ఇలా వుంటే మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే హీరో నవదీప్ ను నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని నార్కోటిక్స్ పోలీసులు నవదీప్ కు నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఆయన నిన్న విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ని మాదక ద్రవ్యాల వినియోగదారునిగా పోలీసులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అసలు మాదక ద్రవ్యాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే విషయంపై పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రాంచందర్ తో నవదీప్ కు గల సంబంధాలపై పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా వుంటే నవదీప్ స్నేహితుడు రాంచందర్ నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.
మరో వైపు రాంచందర్ ఇచ్చిన సమాచారం మేరకు తెలుగు ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖులపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అసలు సినీ ఇండస్ట్రీలోకి మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? వాటి వెనుక వున్న అసలైన సూత్రధారులు ఎవరు అనే విషయాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. మరికొందరిని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.