కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో అతి కీలకమైంది మేడిగడ్డ (Medigadda Barrage) బ్యారేజ్. పిల్లర్లు కూలడంతో ఇప్పుడీ బ్యారేజీ పేరు మార్మోగుతోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అయితే.. బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఫిర్యాదు అందజేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదైంది. మహదేవ్పూర్ పోలీసులు (Police) ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పిల్లర్ కింద భారీ శబ్ధం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే ఫిర్యాదు చేశారు.
పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టి పెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఎవరైనా కావాలనే ఇది చేశారా? అనే అనుమానంతో పోలీసుల దర్యాప్తు కొనసాగనుంది.
మరోవైపు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కేంద్ర బృందంతో కలిసి పరిశీలించారు. జరిగిన నష్టం, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలను కేంద్ర కమిటీ సభ్యులు కూలంకశంగా తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. ఈ కమిటీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.