112
ఢిల్లీ (Delhi)లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కనీస మద్దతు ధర (MSP) కోరుతూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు సంగ్రూర్ నుంచి మరో బృందం కూడా దేశ రాజధానికి బయలుదేరింది.
భారీ సంఖ్యలో రైతులు ఢిల్లీ వైపు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్ -హర్యానా సరిహద్దుల్లోని శంభు సరిహద్దు వద్దకు చేరుకోగానే అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైతులు వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ రైతులు ససేమేరా అనడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల సహాయంతో స్మోక్ బాంబ్స్ వేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. పోలీసుల తీరులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. తాము బారికేడ్లను బద్దలు కొట్టాలని అనుకోవడం లేదని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ తెలిపారు.
చర్చలతోనే శాంతియుతంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నామని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. రోడ్లను బ్లాక్ చేసేందుకు తాము ప్రయత్నించలేదన్నారు. ప్రభుత్వమే అలా చేస్తోందన్నారు.