నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Aravind) కు పోలీసులు షాక్ ఇచ్చారు. 2020 ఎన్నికలకు సంబంధించి తాజాగా ఆయనకు నోటీసులు (Notice) జారీ చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో అరవింద్ ఎన్నికల కోడ్ (Election Code) ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను వ్యక్తిగతంగా అందజేసేందుకు అరవింద్ ఇంటికి ఈ రోజు పోలీసులు వెళ్లారు.
కానీ ఆ నోటీసులను తీసుకునేందుకు ఎంపీ అరవింద్ నిరాకరించారు. ఎప్పుడో మూడేండ్ల క్రితం కేసు నమోదైతే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను ఆ నోటీసులను తీసుకోబోనని కరాఖండిగా చెప్పారు. దీంతో నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని పోలీసులు యోచిస్తున్నారు.
2020 మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఎల్లమ్మగుట్టలో ఎంపీ అరవింద్ ప్రచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ నేపథ్యంలో అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తు జరపుతున్నారు.
ఈ కేసులో భాగంగా మొదట ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అరవింద్ ఇంటికి పోలీసులు వెళ్లారు. కానీ అక్కడ ఆయన లేరనే విషయం తెలుసుకున్ని పోలీసులు వెనుదిరిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు అరవింద్ వెళ్లారనే విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆయన దానికి నిరాకరించారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.