శ్రీశైలం (Srisailam) దేవస్థానంలో కొందరూ హోంగార్డులు (Home Guards) పోలీసుతో కలిసి పేకాటాడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారాయి. దేవుడూ దేవాలయాలనూ ఎంతో పవిత్రంగా ఉంచాలనుకుంటాం. ఏ చిన్న అపచారం జరిగినా అయ్యో అపచారం జరిగింది మన్నించు స్వామీ అంటూ వేనోళ్ల వేడుకుంటాం. అలాంటిది ఆలయ ధర్మాన్నీ భక్తుల మనోభావాలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం ఇప్పుడు చర్చాంశనీయమైంది.
శ్రీశైలం ఆలయానికి దగ్గరలోని విశ్రాంతి గదిలో పేకాట ఆడుతున్న వీరు… పోలీస్ ప్రోటోకాల్ సిబ్బంది, VIP కార్ ఎంట్రెన్స్ వద్ద విధులు నిర్వర్తించే హోంగార్డ్ సిబ్బంది కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఆలయాలకు కాపలా ఉండాల్సిన పోలీసు సిబ్బందే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏ దేవస్థానంలోనూ మద్యం, జూదం మొదలైన వాటిని అనుమతించరు. అయితే స్థానిక పోలీసులే శ్రీశైలంలోనే పేకాట ఆడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భక్తులు లేదా స్థానికులు ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏలాంటి భయమూ లేకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న ఇలాంటివారిమీద కఠినమైన చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే వారిని సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో కూడా తరుచూ ఇలా పేకాటాడుతూ పోలీసులు చిక్కడం, ఇప్పుడు శ్రీశైలంలో కూడా ఇలా జరగడంతో… ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు అంటున్నారు.