రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.. సాగర్ డ్యామ్‌పై ముళ్లకంచెలు ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు… మరోవైపు ఏపీకి చెందిన పోలీసులు కూడా మోహరించారు. డ్యామ్‌పై తమకు సమాన హక్కులు ఉన్నాయంటూ గురువారం రాత్రి ఏపీ పోలీసులు బలవంతంగా డ్యామ్ మీదకు చొచ్చుకెళ్లిన విషయం తెలిసిందే.
మరోవైపు తెలంగాణ (Telangana) సీఎం కార్యాలయ అధికారులు, నీటి పారుదలశాఖ అధికారులు డ్యామ్ వద్దకు వెళ్ళి సమీక్షించనున్నారు. నేడు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఐజీ (IG)స్థాయి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది. కాగా ఇదివరకే ఏపీ (AP) అధికారులు సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరే అవకాశమున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా అనుమతి లేకుండా డ్యామ్‌పైకి రావడమే గాక సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో, ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై.. సాగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా డ్యామ్ పైకి వచ్చారని, అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో తెలంగాణ ఎస్పీఎఫ్ (SPF) పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు (police) భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని డిమాండు చేస్తోంది. కానీ బుధవారం రాత్రి ఆకస్మాత్తుగా ఏపీ పోలీసులు పెద్దసంఖ్యలో డ్యామ్ పై మోహరించి.. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం తమ 13 గేట్ల నుంచి కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.